అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం
అల్లగడ్డ: నంద్యాల జిల్లా అల్లగడ్డ పట్టణంలోని ప్రజ్ఞ కళాశాల సమీపంలో చెత్తబుట్టలో మృత శిశువు లభించడం కలకలం రేపింది. అప్పుడే జన్మించినట్లు కనిపిస్తున్న శిశువు మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చెత్తబుట్టలో వదిలివెళ్లినట్లు సమాచారం.
స్థానికుల సమాచారం మేరకు చెత్తబుట్ట వద్దకు వచ్చిన వీధికుక్కల కారణంగా పారిశుద్ధ్య కార్మికులు మృత శిశువును గుర్తించినట్లు తెలుస్తోంది. అనంతరం మృతదేహాన్ని అక్కడి నుంచి బయటకు తీశారు.
శిశువు ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో మృతి చెందింది, మృతదేహాన్ని చెత్తబుట్టలో ఎవరు వదిలివెళ్లారనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. శిశువు మృతి అనంతరం మృతదేహాన్ని అక్కడ వదిలారా, లేక అంతకుముందే తీసుకువచ్చి పడేశారా అనే అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇటీవల అల్లగడ్డలోని కాశీంతల బ్రిడ్జి కింద కూడా మృత శిశువు లభించిన ఘటన వెలుగులోకి రావడంతో తాజా ఘటనపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వరుస ఘటనలపై అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.