ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన
యాదాద్రి జిల్లా, రామన్నపేట: ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. డీవైఎఫ్‌ఐ రామన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఓటు చోరీ ఆరోపణలపై తమ సంఘం ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై పలు ఆరోపణలు చేశారు.
దేశంలో కోట్లాది ఓట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని అన్నారు.
ఎన్నికల ప్రక్రియలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా పారదర్శకంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
బెంగాల్‌లోనూ పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపు జరిగిందని ఆరోపణలు ఉన్నాయని అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై స్పందించే వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రామన్నపేట మండల అధ్యక్షుడు మెట్టు శ్రవణ్ కుమార్, మండల కార్యదర్శి శానకొండ రామచంద్రం, మండల కమిటీ సభ్యులు మునికుంట్ల లెనిన్, నాగటి రవి, జేల్లాల మల్లేశం, ఆవనగంటి మహేష్, గట్టు మహేష్, మచ్చ నరేష్ తదితరులు పాల్గొన్నారు.