వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్
రామన్నపేట: గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా కామినేని హాస్పిటల్స్ (ఎల్బీనగర్) సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి అన్నారు.
మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని రైతు వేదిక ప్రాంగణంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎడ్ల మహేందర్ రెడ్డి వైద్య సిబ్బందిని అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఇలాంటి ఉచిత వైద్య సేవలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
మంగళంపల్లి గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో బీపీ, షుగర్, కంటి పరీక్షలు నిర్వహించారు. జ్వరం, జలుబు, నీరసం, నొప్పులకు సంబంధించిన మందులను ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో కామినేని హాస్పిటల్స్ సిబ్బంది, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.