రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
రామన్నపేట, అక్టోబర్ 13: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణంలోని చెన్నకేశవ స్వామి ఆలయం, శివాలయం, ఎంప్లాయిస్ కాలనీ, గౌండ్ల కాలనీలతో పాటు మండలంలోని కక్కిరేణి, ఎన్నారం, మునిపంపుల, ఇంద్రపాలనగరం, వెల్లంకి, సిరిపురం, లక్ష్మాపురం, నిదానపల్లి తదితర గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రతి జీవికి ఆహారమే జీవనాధారమని, అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే దేవతగా భక్తులు విశ్వసిస్తారని నిర్వాహకులు తెలిపారు. అన్నపూర్ణాదేవిని పూజిస్తే అన్నానికి లోటుండదని భక్తుల నమ్మకమని పేర్కొన్నారు.
రామన్నపేట పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీలో వినాయక మిత్ర మండలి అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం, హోమం నిర్వహించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అక్కెనపల్లి ప్రవీణ్ కుమార్, బాకూరి శివ, ఒంటెద్దు రమేష్, కందుకూరు శంకర్, బత్తుల శీను, మినుముల సందీప్, రాచకొండ రాజేష్, నామానంది వినయ్, గంగాపురం గణేష్, శ్యామల ప్రవీణ్, ఒంటెద్దు బాలకృష్ణ, రేవంత్, ఉష, బడుగు లావణ్య, రఘు, మద్దెగల్ల కళ్యాణి, నరసింహ, కోట ఉమాశ్రీ, విజయ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.