పెనుగొలనులో వైభవంగా గణపతి నిమజ్జనోత్సవం.. ఘనంగా అన్నదానం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి గణపతి నిమజ్జనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం సమీపంలో ప్రతిష్ఠించిన గణపతిని మేళతాళాల నడుమ ప్రధాన వీధులలో ఊరేగించి అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు.
గణపతి గ్రామోత్సవానికి బయలుదేరే ముందు ప్రథమ పూజాధిపతి గణపతికి నమస్కరించిన గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 25 కిలోల లడ్డూ వేలం నిర్వహించగా శీలంనేని భరత్ కుమార్ రూ.1,00,116కు దక్కించుకున్నారు. మరో 11 కిలోల లడ్డూ వేలంలో పసుపులేటి శ్రీను రూ.22,116కు లడ్డూను దక్కించుకున్నారు.
గణపతి పందిరి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రంగుల విద్యుత్ దీపాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అలంకరణలను ఆసక్తిగా తిలకించారు.
వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్నదానం
పెనుగొలను బస్టాండ్ సెంటర్‌లో వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి వద్ద శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, గ్రామస్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గణపతిని ప్రధాన వీధుల్లో గ్రామోత్సవంగా ఊరేగించి నిమజ్జనం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.