అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. కుప్పకూలిన లియర్‌జెట్!
- ఫ్లోరిడాలో నివాస ప్రాంతంపై కూలిన ప్రైవేట్ జెట్
- విమానంలో ఉన్న 9 మంది మృతి
ఫ్లోరిడా (ఎన్ టుడే న్యూస్): అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్ బీచ్ కౌంటీలో ఆదివారం ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన మార్-ఎ-లాగో నివాసానికి సమీపంలో ఈ ఘటన జరగడం కలకలం రేపింది.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. లియర్‌జెట్-60 విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్‌స్ట్రామ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బహమాస్‌లోని నార్త్ ఎల్యూథెరా విమానాశ్రయానికి బయలుదేరింది. ప్రయాణం మధ్యలో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ పరిధిలో క్రీస్ట్‌హేవెన్ సమీపంలోని నివాస ప్రాంతంలో విమానం కూలిపోయింది.
ప్రమాదం అనంతరం భారీగా మంటలు చెలరేగడంతో పాటు రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడింది. విమానంలో ఉన్న తొమ్మిది మందీ మరణించినట్లు అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ ధ్రువీకరించారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), జాతీయ రవాణా భద్రతా మండలి (NTSB) సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. విమానం కూలిపోవడానికి ముందు వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలు ఏమైనా కారణమయ్యాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.