కోనసీమకు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందా
దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం.. బంగాళాఖాతంలో బలపడే అవకాశం
అమలాపురం, అక్టోబర్ 29 (ఎన్ టుడే న్యూస్): అర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి తీరప్రాంతాలు కోలుకుంటున్న వేళ బంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ ఏర్పడింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. అనంతరం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో వాయుగుండంగా మారే అవకాశముందని అంచనా వేసింది.
మరో తుఫాన్‌గా మారుతుందా?
కొత్తగా ఏర్పడిన అల్పపీడనం భవిష్యత్తులో తుఫాన్‌గా మారుతుందా, దాని ప్రయాణ మార్గం ఎలా ఉండనుందనే అంశాలపై ప్రస్తుతం స్పష్టత లేదు. ఈ వ్యవస్థ కదలికలు, తీవ్రతను వాతావరణ శాఖ నిరంతరం పరిశీలిస్తోంది.
కోనసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కొత్త వాతావరణ వ్యవస్థ ప్రభావం కోనసీమపై ఎంతమేరకు ఉంటుందనే విషయంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. రైతులు, మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను గమనించాలని సూచిస్తున్నారు.