జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
- కొత్త కాలనీ, సోమసుందర్ రెడ్డి నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేద కుటుంబానికి చెందిన ఇంటిని జేసీబీతో దౌర్జన్యంగా కూల్చివేసి వారిని రోడ్డుపాలు చేయడం అత్య
- జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
- బాధిత కుటుంబాన్ని రోడ్డుపాలు చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి
బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన చిర్ల జగ్గిరెడ్డి
ఎఫ్‌ఐఆర్‌లో రౌడీషీటర్ పేరు ఉన్నా అరెస్ట్ ఎందుకు చేయలేదు
పోలీసు వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలి.................డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి
రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలోని కొత్త కాలనీ, సోమసుందర్ రెడ్డి నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేద కుటుంబానికి చెందిన ఇంటిని జేసీబీతో దౌర్జన్యంగా కూల్చివేసి వారిని రోడ్డుపాలు చేయడం అత్యంత దారుణమని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సత్యవతి అనే మహిళకు గతంలో ఇంటి పట్టా ఇచ్చారని, ఆ పట్టా ఆధారంగా కుటుంబం సుమారు నాలుగున్నర సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటూ ఇంటిని నిర్మించుకుని, విద్యుత్ కనెక్షన్ తీసుకుని బిల్లులు చెల్లిస్తూ జీవనం సాగిస్తోందని తెలిపారు. అయితే స్థలానికి సంబంధించి సివిల్ కోర్టులో వివాదం నడుస్తున్న విషయం కూడా ఉందని, ఆ స్థలం ఎవరిదనే విషయాన్ని న్యాయస్థానం నిర్ణయిస్తుందని అన్నారు.
కోర్టులో వివాదం నడుస్తున్న సమయంలోనే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు జేసీబీతో వచ్చి ఇంటిని కూల్చివేయడం దౌర్జన్యానికి నిదర్శనమన్నారు. ముఖ్యంగా ఇంట్లో బాలింతగా ఉన్న మహిళతో పాటు కుటుంబ సభ్యులు ఉండగానే వారిని బయటకు వెళ్లేందుకు కనీస అవకాశం కూడా ఇవ్వకుండా ఇల్లు నేలమట్టం చేయడం అమానుషమని మండిపడ్డారు.ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు ఎవరినైనా ఒక స్థలం నుంచి ఖాళీ చేయించాల్సి వస్తే ముందుగా నోటీసులు ఇవ్వడం, చట్టపరమైన ప్రక్రియను పాటించడం, అవసరమైతే ప్రత్యామ్నాయ వసతి కల్పించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా ఇంటిని కూల్చివేయడం ఏ విధమైన పాలన అని ప్రశ్నించారు.ఇల్లు కూల్చివేస్తున్న సమయంలో బాధితులు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి జేసీబీని అక్కడి నుంచి తీసుకెళ్లారని తెలిపారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు చెబుతున్నారని, అందులో రౌడీషీటర్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారని అన్నారు. అలాంటప్పుడు ఘటనకు ఉపయోగించిన జేసీబీని సీజ్ చేసి, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ 24 గంటలు గడిచినా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.తప్పు చేసిన వారే బయట స్వేచ్ఛగా తిరుగుతున్న పరిస్థితి ఉంటే పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారుఇటీవల ఇదే ప్రాంతంలో హత్య ఘటనలు చోటుచేసుకున్నాయని, అలాంటి పరిస్థితుల్లో మళ్లీ అదే ప్రాంతంలో దౌర్జన్యాలకు పాల్పడటం ఆందోళనకరమన్నారు. కాలనీలో అక్రమ ఆక్రమణలకు పాల్పడుతూ ఆ ప్రాంతం పేరును చెడగొడుతున్న వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు
కులం, మతం, పార్టీ అనే తేడాలు లేకుండా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఇల్లు కోల్పోయి రోడ్డున పడిన కుటుంబానికి తక్షణ న్యాయం చేయడంతో పాటు, ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా పోలీసులు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే బాధిత కుటుంబంతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద న్యాయం కోసం పోరాటం చేస్తామని చిర్ల జగ్గిరెడ్డి హెచ్చరించారు.