రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన, ఏరోస్పేస్ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పైలట్ శిక్షణ అకాడమీల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఇందులో భాగంగా కర్నూలు, రాజమండ్రి, కడప ప్రాంతాల్లో మరో ఐదు ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ (FTOలు) ప్రారంభించనున్నట్లు తెలిపింది.
రాయలసీమ ప్రాంతాన్ని ఏరోస్పేస్ రంగానికి అనుసంధానించేలా పలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్నట్లు పేర్కొంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు, పుట్టపర్తిలో కాంబ్యాట్ ఎయిర్‌క్రాఫ్ట్ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, కర్నూలు–కడప ప్రాంతాల్లో పైలట్ శిక్షణ కేంద్రాలు, కుప్పంలో ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ వంటి ప్రాజెక్టులను ప్రస్తావించింది.
ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే రాయలసీమ ప్రాంతంలో విమానయాన, డ్రోన్, ఏరోస్పేస్ రంగాలకు సంబంధించిన శిక్షణ, తయారీ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంటోంది. ముఖ్యంగా యువతకు ఏరోస్పేస్ రంగంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఉద్యోగ అవకాశాలకు ఇవి ఉపయోగపడతాయని తెలిపింది.
కర్నూలులో జరిగిన కార్యక్రమంలో ఏపీ మంత్రులు బి.సి. జనార్ధన్ రెడ్డి, టి.జి. భరత్, కర్నూలు ఎంపీ పంచలింగాల నాగరాజు, ఎమ్మెల్యేలు దస్తగిరి, చరిత, శ్యామ్ బాబు తదితరులు పాల్గొని ప్రాజెక్టుల ప్రారంభ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
రాయలసీమలో ఏరోస్పేస్ రంగానికి సంబంధించిన శిక్షణ, పరిశోధన, తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.