కుక్కునూరు దోపిడీ కేసులో నలుగురు అరెస్ట్
వృద్ధురాలిపై దాడి చేసి బంగారు నానుతాడు అపహరణ.. 21.600 గ్రాముల బంగారం, నేరానికి ఉపయోగించిన కారు స్వాధీనం
ఏలూరు జిల్లా కుక్కునూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో వృద్ధ మహిళపై దాడి చేసి ఆమె మెడలోని బంగారు నానుతాడును బలవంతంగా లాక్కెళ్లిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 9న జరిగిన ఘటనపై కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసిన క్రైం నంబర్ 76/2026, బీఎన్‌ఎస్ సెక్షన్లు 134, 307 కింద కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. కుక్కునూరు మండలం వెంకటాపురం గ్రామంలోని తిమ్మంపేట అడ్డరోడ్డు వద్ద బుధవారం ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు పురుషులు, ఒక మహిళను పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో జంగారెడ్డిగూడెంకు చెందిన షేక్ ఖాసిం అలియాస్ భాషా అలియాస్ జటాలు (26), వాసంశెట్టి రామచంద్ర పవన్‌కుమార్ అలియాస్ స్కైలాబ్ (19), నలుబోలు లోకేష్ (27), తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం బుట్టా లక్ష్మీపురానికి చెందిన పాయం రుతు (26) ఉన్నారు. వీరిలో షేక్ ఖాసింపై గతంలో జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, నల్లజర్ల పోలీస్‌స్టేషన్ల పరిధిలో మొత్తం 17 కేసులు ఉండగా, వాటిలో ఒకటి హత్య కేసుగా పోలీసులు తెలిపారు. పవన్‌కుమార్‌పై 10 కేసులు, లోకేష్‌పై మూడు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా నిందితులు డబ్బుల అవసరంతో దోపిడీకి పథకం వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తెల్లవర్ణం మారుతి సుజుకి కారులో కుక్కునూరు మీదుగా వెళ్తుండగా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిని గుర్తించి కారును ఆపి ఆమెను అడ్డుకున్నారు. అనంతరం బెదిరించి దాడి చేసి ఆమె మెడలోని సుమారు మూడు కాసుల బంగారు నానుతాడును లాక్కున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళ అల్లుడిని కూడా తోసివేసి చంపేస్తామని బెదిరించి కారులో పరారయ్యారు. అయితే తప్పించుకునే క్రమంలో వెంకటాపురం–తిమ్మంపేట రహదారిపై కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ముందు ఎడమవైపు టైరు ప్రాంతం దెబ్బతింది. దీంతో కారును సమీప అటవీ ప్రాంతంలో దాచిపెట్టి నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల నుంచి బాధితురాలి బంగారు నానుతాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూసలతో కలిపి దాని బరువు 21.600 గ్రాములుగా ఎలక్ట్రానిక్ తూకం ద్వారా నిర్ధారించారు. అలాగే నేరానికి ఉపయోగించిన టీఎస్ 03 ఈటీ 4530 నంబరు గల తెల్లరంగు మారుతి సుజుకి కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను బుధవారం ఉదయం 11.30 గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేసి చోరీకి గురైన బంగారాన్ని, నేరానికి ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్న కుక్కునూరు సీఐ పి. బాల సురేష్‌బాబు, ఎస్‌ఐ కె. రాజారెడ్డి, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.