ఎర్ర రథంపై లిబరేషన్ ప్రచార బేరి..
ప్రజలను ఆకట్టుకున్న దుర్గం పుల్లారావు ఎన్నికల ప్రచారం ధరల తగ్గింపు, ఉచిత విద్యా వైద్యం
ఎర్ర రథంపై లిబరేషన్ ప్రచార బేరి.. ప్రజలను ఆకట్టుకున్న దుర్గం పుల్లారావు ఎన్నికల ప్రచారం
ధరల తగ్గింపు, ఉచిత విద్యా వైద్యం, రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా
ఏలూరు జిల్లా, చాట్రాయి: చాట్రాయి మండలంలో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఎన్నికల ప్రచారం వినూత్నంగా సాగింది. చాట్రాయి జెడ్పీటీసీ స్థానానికి దుర్గం పుల్లారావు, చిత్తపూరు ఎంపీటీసీ స్థానానికి ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారి ప్రచార సరళి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. పార్టీ కార్యకర్తలు తమ సొంత ఖర్చులతో ఎర్రజెండాలు సమకూర్చుకుని ఆటో చుట్టూ ఎర్రజెండాలు కట్టి ఎర్ర రథంపై ప్రచార బేరి మోగించారు. ప్రధాన కూడళ్లలో వీధి సమావేశాలు నిర్వహిస్తూ నాటి కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు గుర్తుచేశారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. పెరిగిన నిత్యావసర ధరలను తగ్గించాలని, విద్యా వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందించాలని, ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని, నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాట్రాయి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, రైతుల రుణాలను మాఫీ చేయాలని, పోలవరం ఫేజ్-2 ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీ భూములకు సంబంధించిన 4వ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని చేసిన డిమాండ్లు ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్, డి. పుల్లారావు, వేముల బక్కయ్య, ఆర్‌వైఏ రాష్ట్ర కన్వీనర్ ఉన్నం అనిల్, చాట్ల బాబూరావు, మీసపాం ప్రభాకర్, భవాని, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.