ఎమ్మెల్యే రోషన్ కుమార్‌పై దుష్ప్రచారాన్ని ఖండించిన మల్లాయగూడెం గ్రామస్తులు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌పై కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మల్లాయగూడెం గ్రామస్తులు ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేకే ఇలాంటి ప్రచారాలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు.
తమను ప్రలోభపెట్టి విమర్శనాత్మకంగా మాట్లాడించారని, అనంతరం తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రసారం చేసి ఇబ్బందులకు గురిచేశారని తక్కెళ్లపాటి రమేష్ అనే కార్యకర్త కౌంటర్ వీడియో ద్వారా వెల్లడించినట్లు గ్రామస్తులు తెలిపారు.
నియోజకవర్గ కేంద్రం చింతలపూడిలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని రమేష్ పేర్కొన్నట్లు తెలిపారు. కార్యకర్తలు, ప్రజలను నిరంతరం కలుస్తూ గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారని గ్రామస్తులు వివరించారు.
ఎమ్మెల్యేపై ఆధారాలు లేని ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని గ్రామస్తులు అన్నారు. వ్యక్తులు గానీ, మీడియా సంస్థలు గానీ తప్పుడు ప్రచారాలు, ప్రసారాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.