మురసు తుపాను నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం
ఎన్టీఆర్ జిల్లా, కంభంపాడు: మురసు తుపాను నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. ఈ మేరకు కంభంపాడులోని 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుపాను ప్రభావంతో విద్యుత్ శాఖకు ఎదురయ్యే నష్టాలను నివారించేందుకు చేపట్టిన ముందస్తు భద్రతా చర్యలను, విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పకడ్బందీగా సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. తుపాను కారణంగా ఎలాంటి విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు ఏర్పడితే వెంటనే స్పందించి పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏ.కొండూరు తహసీల్దార్ వై. నాగమణి, కంభంపాడు విద్యుత్ శాఖ ఏఈ టి. నటరాజరెడ్డి, జేఈ జె. కోటేశ్వరరావు, లైన్ ఇన్‌స్పెక్టర్ ఎం. శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.