నేటి నుంచి డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 25 పరీక్షా కేంద్రాల ఏర్పాటు.. సమయానికి చేరుకోవాలని విద్యార్థులకు సూచన
నల్లగొండ, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్): మహాత్మా గాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) పరిధిలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా డిగ్రీ విద్యార్థులకు మంగళవారం నుంచి 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు యూనివర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు
పరీక్షల షెడ్యూల్ ప్రకారం ఉదయం 5వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు, మధ్యాహ్నం 3వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంజీయూ సీఈవో డాక్టర్ ఉపేందర్‌రెడ్డి తెలిపారు.
25 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
పరీక్షల నిర్వహణ కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో నల్లగొండ జిల్లాలో 9, సూర్యాపేట జిల్లాలో 8, యాదాద్రి భువనగిరి జిల్లాలో 8 కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.
సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి
విద్యార్థులు తమ హాల్‌టికెట్లు, అవసరమైన పరీక్షా సామగ్రితో నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షల సమయంలో నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరారు.