సాంభార్ సరస్సులో తొలిసారిగా వేలాది ఫ్లెమింగో గూళ్లు, పిల్లలు
వలస పక్షులుగా వచ్చే ఫ్లెమింగోలు అక్కడే సంతానోత్పత్తి.. కొత్త బ్రీడింగ్ కేంద్రంగా మారుతున్న సరస్సు
జైపూర్, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):
రాజస్థాన్‌లోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సాంభార్ లేక్ వద్ద వేలాది ఫ్లెమింగోల గూళ్లు, పిల్లలు తొలిసారిగా కనిపించడం పర్యావరణ రంగంలో ఆసక్తికర పరిణామంగా మారింది. ఇప్పటివరకు ఈ ప్రాంతానికి వలస పక్షులుగా మాత్రమే వస్తున్న ఫ్లెమింగోలు, తాజాగా ఇక్కడే గూళ్లు కట్టి గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతున్నట్లు సమాచారం.
సంతానోత్పత్తి కేంద్రంగా సాంభార్ సరస్సు
ఫ్లెమింగోలు పెద్ద సంఖ్యలో గూళ్లు నిర్మించి పిల్లలను పెంచుతుండటంతో సాంభార్ సరస్సు కొత్త సంతానోత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నట్లు భావిస్తున్నారు. ఈ పరిణామం సరస్సు పర్యావరణ ప్రాధాన్యాన్ని మరింత పెంచుతోంది.
పర్యావరణ నిపుణుల్లో హర్షం
గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతం తర్వాత ఫ్లెమింగోల సంతానోత్పత్తికి సాంభార్ సరస్సు మరో ముఖ్యమైన వేదికగా నిలుస్తుండటం పర్యావరణ నిపుణుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ పక్షుల ఆవాసాలను, సంతానోత్పత్తి ప్రాంతాలను పరిరక్షించడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.