డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు
రాయికల్: పట్టణంలోని కోరుట్ల బైపాస్ రోడ్డును ఆనుకుని ఉన్న కొండపోచమ్మ కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు తెలిపారు. మురుగునీరు, వర్షపు నీరు సక్రమంగా పారుదల కాకపోవడంతో గత మూడేళ్లుగా సమస్య కొనసాగుతోందని పేర్కొన్నారు.
మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు, పందుల బెడద పెరిగిందని, దీంతో పరిసరాల్లో పారిశుధ్య సమస్యలు ఏర్పడుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. విషజ్వరాల భయం నెలకొంటోందని తెలిపారు.
డ్రైనేజీ ఏర్పాటు చేయాలని పలుమార్లు మున్సిపల్ అధికారులు, సిబ్బందికి విన్నవించడంతో పాటు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు.
రోడ్డుకు ఆనుకుని ఉన్న డ్రైనేజీని కొందరు పూడ్చివేసి నిర్మాణాలు చేపట్టారని, ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు కనిపించలేదని కాలనీవాసులు పేర్కొన్నారు.
మున్సిపాలిటీకి ఇంటి పన్నులు, ఇతర పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలైన మురుగునీటి పారుదల వ్యవస్థ, మంచినీటి పైప్‌లైన్, రోడ్ల మరమ్మతులు వంటి పనులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు.
ఈ సమస్యలపై ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు కాలనీవాసులు తెలిపారు. సమస్యలు పరిష్కరించే వరకు ఇంటి పన్ను, ఇతర పన్నుల చెల్లింపులను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు ముక్కెర శేఖర్, వాసం రాజేందర్, దొంగ హరికృష్ణ, బ్యాంకు రాజం, పెద్దోళ్ల రాజారెడ్డి, పటేల్ నరేందర్, పల్లికొండ చిరంజీవి, చిలువేరు రమేష్ తదితరులు తెలిపారు.
ఈ సమస్యపై సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి, డ్రైనేజీ మరియు పారిశుధ్య సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.