ఫోన్ చూస్తోందని కన్న కూతురిని హతమార్చిన తల్లి!
ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం.. పోస్టుమార్టం నివేదికతో వెలుగులోకి హత్య ఘటన
పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితురాలు
కొత్తూరు, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని హనుమాన్ కాలనీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫోన్ చూస్తోందని, చెప్పిన మాట వినడం లేదనే కారణంతో 14 ఏళ్ల కన్న కూతురిని తల్లి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
హనుమాన్ కాలనీలో ఆటో డ్రైవర్ ముయ్యడి రాజు, విజయలక్ష్మి దంపతులు తమ ముగ్గురు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నారు. వారిలో సువర్చల (14) తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లి విజయలక్ష్మి తరచూ మద్యానికి బానిసై కుమార్తెతో గొడవపడేదని సమాచారం.
గొంతు నులిమి హత్య చేసినట్లు ఆరోపణ
ఈ నెల 27న ఇంటికి తిరిగి వచ్చిన విజయలక్ష్మికి సువర్చల ఫోన్ చూస్తూ కనిపించడంతో కోపానికి గురైందని, ఆ సమయంలో కుమార్తె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
అనంతరం బాలిక మెడకు చీర చుట్టి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. భర్తకు ఫోన్ చేసి కుమార్తె ఆత్మహత్య చేసుకుందని సమాచారం ఇచ్చింది. ఇటీవలే బాలిక పుష్పవతి కావడం, కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు తొలుత ఆత్మహత్యగా భావించినట్లు సమాచారం.
పోస్టుమార్టం నివేదికతో వెలుగులోకి వాస్తవాలు
అయితే పోస్టుమార్టం నివేదికలో వెల్లడైన అంశాలు, తల్లి ప్రవర్తనపై వచ్చిన అనుమానాల నేపథ్యంలో పోలీసులు కేసును హత్య కోణంలో విచారించారు. విచారణలో విజయలక్ష్మి తన కుమార్తెను తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం.
తరచూ ఫోన్ చూస్తోందని, తన మాట వినడం లేదనే కారణంతో ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితురాలు పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.