ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
అధికారులకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశం
పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష
ఉరుమడ్ల, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):
బ్రహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఉరుమడ్ల గ్రామంలోని తన నివాసంలో ఉదయ సముద్రం కాల్వ పనుల పురోగతిపై సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ, సీఈ, ఈఈ, ఎస్ఈ తదితర అధికారులను పనుల ప్రస్తుత స్థితిగతులు, ఇప్పటివరకు సాధించిన పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పనుల్లో జాప్యం లేకుండా చర్యలు
కాల్వ పనుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అధికారులతో చర్చించి, వాటి పరిష్కారానికి తగిన సూచనలు చేశారు. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.