పెనుగొలనులో లోక కల్యాణం కోసం నగర సంకీర్తన
వైభవంగా హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమం
పెనుగొలను: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో లోకం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ఆదివారం శ్రీ సత్యసాయి సేవా కమిటీ ఆధ్వర్యంలో నగర సంకీర్తన నిర్వహించారు. శివాలయం ప్రాంగణంలోని షిరిడీ సాయిబాబా మందిరం నుంచి ప్రారంభమైన నగర సంకీర్తన రేడియో రూము, వాటర్ ట్యాంక్ రోడ్డు, బస్టాండ్, బొడ్రాయి సెంటర్ మీదుగా రామాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా భక్తులు ‘ఓం సాయి, శ్రీ సాయి, జయజయ సాయి’, ‘శ్రీరామ, జయరామ, జయజయరామ’ నామస్మరణ చేస్తూ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా కమిటీ సభ్యులు సుగ్గల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు, సుగ్గల విష్ణు తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం
పెనుగొలను గ్రామంలోని బొడ్రాయి సెంటర్‌లో ఉన్న ఏకశిలా అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద శనివారం రాత్రి భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. స్వామివారిని స్మరిస్తూ భక్తులు భజనలు, చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. అనంతరం భక్తుల సహకారంతో వివిధ రకాల ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమ ఏర్పాట్లను బొలగాని నాగయ్య, కోట దాసు, పసుమర్తి లక్ష్మణరావు తదితరులు పర్యవేక్షించారు.