ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి
ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని డీసీసీబీ అధికారులకు ఉద్యోగుల వినతి
అమలాపురం: ఉమ్మడి జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ (సీఐటీయూ) నాయకులు డీసీసీబీ చైర్‌పర్సన్ తుమ్మల బాబు, సీఈఓ సలాది సురేంద్రబాబు, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీధర్ చౌదరి, డీపీఎం గీతా మాధురిని కలిసి ఉద్యోగుల జీతాల సమస్యను పరిష్కరించాలని కోరారు.
2019 తర్వాత నియమితులైన సిబ్బందికి గత ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని యూనియన్ నాయకులు తెలిపారు. ఉద్యోగాన్ని నమ్ముకుని వందలాది కుటుంబాలు జీవిస్తున్నందున, జీతాల చెల్లింపులో జాప్యం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఎంఎస్ (HRMS) మాడ్యూల్ ద్వారా జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడతామని యూనియన్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తోట వెంకట్రామయ్య, రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణ, కోనసీమ జిల్లా అధ్యక్షుడు యర్రంశెట్టి రామచంద్రరావు, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ, బి. లీలాకృష్ణ, పోలిశెట్టి ఈశ్వరుడు, కే. శ్రీనివాసరాజు తదితరులు, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.