అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి.
సీఐటీయూ జీహెచ్‌ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్
ఎల్బీనగర్, అక్టోబర్ 7 (ఎన్‌టుడే న్యూస్): జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న ఎంఎంసీ అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జీహెచ్‌ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆలేటి ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీఐటీయూ సీనియర్ నాయకులు తుమ్మల సత్తిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తుమ్మల సత్తిరెడ్డి మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎంఎంసీ అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 40 ఏళ్లుగా రోడ్లను శుభ్రం చేస్తూ హైదరాబాద్ నగర పరిశుభ్రతకు సేవలందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కార్మికుల జీవన పరిస్థితుల్లో మాత్రం ఆశించిన మార్పు రావడం లేదని అన్నారు.
ప్రస్తుతం కార్మికులకు చెల్లిస్తున్న వేతనాల నుంచి ఈఎస్‌ఐ, పీఎఫ్ తదితరాల పేరుతో కోతలు విధిస్తున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ కార్మికుల వేతనాల నుంచి 2 శాతం టీడీఎస్ కోత విధిస్తున్నారని, ఆ మొత్తాన్ని వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కేటగిరీల వారీగా కనీసం రూ.30 వేల వేతనం చెల్లించాలని కోరారు. సొసైటీల ద్వారా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెండో పీఆర్‌సీని ప్రకటించి డీఏను వర్తింపజేయాలని కోరారు.
కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 26న ఇంద్రాపార్క్ వద్ద నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ ధర్నాలో ఎంఎంసీ, జీహెచ్‌ఎంసీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తుమ్మల సత్తిరెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న మూడు రోజుల ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంలోనూ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఈ సమావేశంలో హయత్‌నగర్ సర్కిల్ కన్వీనర్, జిల్లా కమిటీ సభ్యులు చింతపల్లి కృష్ణయ్య, ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ అధ్యక్షులు ముషం నరహరి, అలివేలు, దాసరి జయమ్మ, అనసూర్య, శాంతమ్మ, హేమలత, రేణుక, విజిత, సౌందర్య, లక్ష్మమ్మ, శ్రీను, మహేష్, రాజు, బాలరాజ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.