టీజీపీఏలో 112 మంది డీఎస్పీ ట్రైనీల పాసింగ్ అవుట్ పరేడ్
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీ (టీజీపీఏ)లో 112 మంది డీఎస్పీ ఆఫీసర్ ట్రైనీల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీలను అభినందించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీపీఎస్సీ ద్వారా నియామకమై, శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న తొలి డీఎస్పీ బ్యాచ్‌గా ఈ బృందం ప్రత్యేకతను సంతరించుకుంది. మొత్తం 44 వారాలపాటు కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 112 మంది డీఎస్పీలు త్వరలో జిల్లాల్లో క్షేత్రస్థాయి శిక్షణకు సిద్ధమయ్యారు.
తెలంగాణ జనాభాలో కేవలం 0.3 శాతం మందికే పోలీస్ యూనిఫాం ధరించే అవకాశం లభిస్తుందని పేర్కొన్న డీజీపీ, ఈ అవకాశాన్ని బాధ్యతగా భావించి విధులు నిర్వహించాలని సూచించారు. నాయకత్వం, నిజాయితీ, ప్రజాసేవ అనే విలువలను వృత్తి జీవితానికి మార్గదర్శకాలుగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం పోలీస్ శాఖ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ట్రాఫిక్ రద్దీ, ఆహార కల్తీ, వ్యవస్థీకృత నేర ముఠాల కార్యకలాపాలను సమర్థవంతంగా అరికట్టాలని డీఎస్పీ ట్రైనీలకు సూచించారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చేపడుతున్న ప్రత్యేక చర్యలను వివరించారు.
పోలీసు అధికారులు తమ వృత్తి జీవితమంతా శారీరక దృఢత్వం, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీజీపీ సూచించారు. శిక్షణ సమయంలో ఉన్న ఫిట్‌నెస్‌ను పదవీ విరమణ చేసే వరకు కొనసాగించాలని ఆకాంక్షించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన ట్రైనీలకు ట్రోఫీలు అందజేసి, భవిష్యత్తులోనూ సమర్థవంతంగా ప్రజలకు సేవలందించాలని పిలుపునిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.