తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం
తుంగతుర్తి: మండల కేంద్రంలోని పద్మశాలి భవన్‌లో ఐసీడీఎస్ ప్రాజెక్టు తుంగతుర్తి ఆధ్వర్యంలో 9వ పోషణ మాసం ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గర్భిణులకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు. మహిళలు, చిన్నారుల సంక్షేమం, ఆరోగ్యం, పోషణపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు.
బేటీ బచావో–బేటీ పడావో, సఖి, పోషణ అభియాన్, పోషణ మాసం, ‘మన అంగన్వాడీ–మన బాధ్యత’ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సమతుల్య ఆహారం, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై కుటుంబాల్లో అవగాహన పెంచేందుకు అంగన్వాడీ సిబ్బంది నిరంతరం కృషి చేయాలని తెలిపారు.
కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, ఎంఆర్ఓ దయానందం, ఎంపీడీఓ చలపతి, సీడీపీఓ శ్రీదేవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, గ్రామ సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.