మధిర మండలంలో ప్రైవేట్ పత్తి కొనుగోళ్లు ప్రారంభం
మాటూరులో ప్రైవేట్ పత్తి కొనుగోళ్లు ప్రారంభం మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు చేతుల మీదుగా ప్రారంభం
మధిర, ఖమ్మం జిల్లా: మధిర మండలం మాటూరు గ్రామంలోని మంజీత్ కాటన్ మిల్స్‌లో ప్రైవేట్ పత్తి కొనుగోళ్లు మంగళవారం ప్రారంభమయ్యాయి. మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు కొనుగోలు ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిన్నింగ్ మిల్లు సిబ్బంది, రైతులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండారు నరసింహారావు మాట్లాడుతూ రైతులు పత్తిని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు. పత్తిలో తేమ శాతం నిబంధనలను పాటిస్తూ, తడి లేకుండా, చెత్త ఇతర వ్యర్థాలు కలవకుండా శుభ్రంగా ఉంచాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మద్దతు ధరకు సంబంధించిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని పత్తిని విక్రయించాలని తెలిపారు.
పత్తి విక్రయించే సమయంలో రైతులు తూకం, కొనుగోలు వివరాలు, చెల్లింపులకు సంబంధించిన సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. మాటూరులోని మంజీత్ కాటన్ మిల్స్‌లో అందుబాటులో ఉన్న కొనుగోలు సదుపాయాలను రైతులు వినియోగించుకోవాలని, పత్తి విక్రయాల సమయంలో ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఎదురైతే వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులను సంప్రదించాలని తెలిపారు.
పత్తి రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల్లో రైతులకు అవసరమైన సహకారం అందించేందుకు మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ కృషి చేస్తోందని పేర్కొన్నారు.