నకిలీ డాక్యుమెంట్లతో స్థలాల రిజిస్ట్రేషన్లు.. ముఠా అరెస్ట్
హైదరాబాద్: నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ చేసిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA) పత్రాలతో స్థలాల రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఠాను స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఎల్‌బీనగర్ ప్రాంతంలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ముఠా సభ్యులు పాత తేదీలతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు గుర్తించారు. 1982 నాటి పత్రాలుగా చూపించే విధంగా డాక్యుమెంట్లను తయారు చేసి, వాటి ఆధారంగా నకిలీ GPA పత్రాలను రూపొందించినట్లు పోలీసులు తెలిపారు.
విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తుల పేర్లను ఉపయోగించి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పలు రకాల సేల్ డీడ్‌లను సృష్టించి, వాటి ఆధారంగా ఆస్తులపై హక్కులు పొందేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న వ్యక్తుల పేర్లతోనూ నకిలీ పత్రాలు తయారు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు.
నకిలీ డాక్యుమెంట్లను ఉపయోగించి ఎనిమిది ప్రాంతాల్లో మార్టిగేజ్ చేసిన ఆస్తులను విడుదల చేయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు SOT పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి పలు స్టాంప్ పేపర్లు, స్టాంపులు, ఇతర డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నకిలీ పత్రాల తయారీ, ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన లావాదేవీలపై వివరాలు సేకరిస్తున్నారు.
ప్రాపర్టీలకు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పోలీసులు తెలిపారు. ఆస్తుల విషయంలో నకిలీ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సుమతి హెచ్చరించారు. నేరాల తీవ్రతను బట్టి పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు.