నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష
నంద్యాల: పట్టణంలో ఘన వ్యర్థాల నిర్వహణపై స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పఠాభిరామ్ సమీక్ష నిర్వహించారు. పీవీ నగర్‌లోని డంపింగ్ యార్డును సందర్శించిన ఆయన అక్కడ కొనసాగుతున్న లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పనులను పరిశీలించారు.
డంపింగ్ యార్డులో సుమారు 1.78 లక్షల టన్నుల లెగసీ వ్యర్థాలు ఉన్నాయని, అందులో ఇప్పటికే 1.45 లక్షల టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేసినట్లు అధికారులు చైర్మన్‌కు వివరించారు. మిగిలిన వ్యర్థాల ప్రాసెసింగ్‌ను కూడా వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పఠాభిరామ్ అధికారులను ఆదేశించారు.
అనంతరం తడి, పొడి వ్యర్థాల వేర్పాటు, కంపోస్టింగ్, రీసైక్లింగ్, ఇంటింటి చెత్త సేకరణ విధానాలను ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నంద్యాల మున్సిపాలిటీ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది చేపడుతున్న చర్యలను అభినందించారు.
భవిష్యత్తులో డంపింగ్ యార్డుల్లో లెగసీ వ్యర్థాలు పేరుకుపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తడి, పొడి వ్యర్థాలను మూలస్థాయిలోనే వేరు చేసి సక్రమంగా నిర్వహించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు నిరంతర చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.