ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సత్యనారాయణ మృతి
బతుకమ్మ వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సత్యనారాయణ మృతి చెందారు. బతుకమ్మ వేడుకలో ప్రదర్శన ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో సత్యనారాయణ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సత్యనారాయణ గత 15 ఏళ్లుగా మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ కళాకారుడిగా గుర్తింపు పొందారు. తెలుగు రాష్ట్రాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను అలరించారు. తన కళా ప్రదర్శనలతో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
సత్యనారాయణ మృతి వార్తతో కళారంగంలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల కళాకారులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.