జెలెన్‌స్కీ 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన రష్యా
మాస్కో: ఉక్రెయిన్‌లో ఎన్నికల నిర్వహణకు వీలుగా 60 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ చేసిన ప్రతిపాదనను రష్యా తిరస్కరించింది. ఎన్నికల కోసం తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపివేయడం కంటే, వివాదానికి శాశ్వత పరిష్కారం చూపే శాంతి ఒప్పందమే తమ లక్ష్యమని రష్యా స్పష్టం చేసింది.
రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ, దాడులను నిలిపివేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని, అయితే అది శాశ్వత శాంతి ఒప్పందానికి దారితీయాలని పేర్కొన్నట్లు సమాచారం. ఉక్రెయిన్‌తో దీర్ఘకాలిక పరిష్కారం కోసం అన్ని విధాలా కృషి చేస్తామని రష్యా వైఖరిని వెల్లడించారు.
మరోవైపు, జెలెన్‌స్కీ అధ్యక్ష పదవీకాలం 2024లో ముగిసినప్పటికీ, రష్యాతో కొనసాగుతున్న యుద్ధం, మార్షల్ లా అమల్లో ఉండటంతో ఆయన పదవిలో కొనసాగుతున్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఎన్నికల నిర్వహణపై చర్చ కొనసాగుతోంది.