సీపీఐ ప్రజా చైతన్య పాదయాత్రలను జయప్రదం చేయాలి
ఏం.కొండూరు: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తయినా దేశ అభివృద్ధిలో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించలేదని సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, తిరువూరు నియోజకవర్గ పార్టీ కార్యదర్శి తూము కృష్ణయ్య విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం తిరోగమన దిశలో పయనిస్తోందని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న సీపీఐ ప్రజా చైతన్య కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం చీమలపాడు గ్రామంలో శనివారం గోగులమూడి అంజిరెడ్డి అధ్యక్షతన సీపీఐ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తూము కృష్ణయ్య మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎటువంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని, ఎన్నికలను ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని తూము కృష్ణయ్య కోరారు. కార్మికుల హక్కులను పరిరక్షించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలి
కౌలు రైతుల సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల డేవిడ్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని కోరారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, గుర్తింపు కార్డుల ఆధారంగా ప్రభుత్వ పథకాలు, రుణాలు, పంట బీమా, పెట్టుబడి సహాయం తదితర ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
13న చీమలపాడులో బైక్ ర్యాలీ
సీపీఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రజా చైతన్య కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 13న చీమలపాడులో బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు మేకల డేవిడ్ తెలిపారు. చీమలపాడు నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ కృష్ణారావుపాలెం, ఏ.కొండూరు, బీసీ కాలనీ, చైతన్యనగర్ తండా, ఏ.కొండూరు తండా, మత్రియ తండా మీదుగా ఏ.కొండూరు, కంభంపాడు వరకు కొనసాగుతుందని చెప్పారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ బైక్ ర్యాలీని ప్రారంభిస్తారని తెలిపారు. ప్రజా సమస్యలపై నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మహిళలు, విద్యార్థులు, యువత, రైతులు, కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
సెప్టెంబరు 1న చలో ఢిల్లీ
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 1న ఢిల్లీలో నిర్వహించనున్న బహిరంగ సభకు విద్యార్థులు, మేధావులు, యువత, రైతులు, కౌలు రైతులు, కార్మికులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మేకల డేవిడ్ పిలుపునిచ్చారు. ‘మార్పు రావాలి.. మార్పు కావాలి’ అనే నినాదంతో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలను నిర్వహించేందుకు సీపీఐ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి ముచ్చింతల వెంకటేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు ఎస్‌కే కరీముల్లా, తేళ్లూరి సంగీతరావు, పంబి మోహన్‌రావు, కోలా లక్ష్మీకాంతం, సగ్గుర్తి కుమారి, అక్కసాని సుధారాణి, ఆరింపుల సంసోను, కోలికపోగు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.