బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఐటీయూ డిమాండ్
హైదరాబాద్, ఎన్‌టుడే న్యూస్: బతుకమ్మ కుంట భవన నిర్మాణ కార్మికుల అడ్డాలో మహిళా కార్మికుల కోసం ప్రత్యేక మూత్రశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికుల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు జి. రాములు మాట్లాడుతూ.. అడ్డాలో సుమారు 300 మంది భవన నిర్మాణ కార్మికులు రోజువారీ కూలి పనుల కోసం వస్తుంటారని తెలిపారు.
ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు అడ్డాకు చేరుకునే కార్మికులు మధ్యాహ్నం 12 గంటల వరకు పని కోసం ఎదురుచూడాల్సి వస్తోందన్నారు. పని దొరకని రోజుల్లో ఖాళీ చేతులతో ఇళ్లకు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఇంతమంది కార్మికులు ఉండే ప్రాంతంలో కార్మిక శాఖ, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ముఖ్యంగా మహిళా కార్మికులకు మూత్రశాలలు లేకపోవడం తీవ్ర సమస్యగా మారిందన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనుల కోసం అడ్డాలో ఉండే మహిళలు అత్యవసర పరిస్థితుల్లో కూడా టాయిలెట్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీర్ఘకాలికంగా ఇటువంటి పరిస్థితులు కొనసాగడం వల్ల మహిళలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని రాములు పేర్కొన్నారు.
నెలలో 30 రోజులు ఉన్నప్పటికీ 10 నుంచి 15 రోజులు కూడా సక్రమంగా పని దొరకకపోవడంతో కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. కార్మికుల కోసం అడ్డా వద్ద జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇందిరమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేసి రూ.5కే భోజనం అందించాలని, ఉదయం టిఫిన్ సదుపాయం కూడా కల్పించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల సమస్యలను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించి, మహిళలకు ప్రత్యేక మూత్రశాలలతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నగర కార్యదర్శి సుబ్బారావు, అడ్డా మాజీ అధ్యక్షులు సురేష్, ధర్మానాయక్, తిరుపతి, కార్మికులు కొండబాబు, మంగీలాల్, సుగుణ, సరోజ, అరుణ, కమల, పార్వతి, అనూష, మౌనిక తదితరులు పాల్గొన్నారు.