తెలంగాణ ఉద్యోగులకు రెండు డీఏలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏల్లో రెండు డీఏలను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ మంజూరు చేయనుండగా, బకాయిలను విడతల వారీగా చెల్లించనున్నట్లు వెల్లడించింది.
ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రెండు డీఏల మంజూరుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ.2,500 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనున్నట్లు వివరించింది.
కరువు పరిస్థితులపై కేబినెట్ చర్చ
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై మంత్రివర్గం చర్చించింది. ప్రస్తుత వర్షాకాలంలో సుమారు 17 శాతం వర్షపాతం లోటు నమోదైందని, దాదాపు 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు సమావేశంలో చర్చించినట్లు ప్రభుత్వం తెలిపింది.
కరువు ప్రభావిత ప్రాంతాల్లో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ సబ్‌కమిటీ సమగ్రంగా చర్చించాలని నిర్ణయించింది. ఈ అంశంపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించడంతో పాటు రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణుల నుంచి సూచనలు తీసుకోవాలని నిర్ణయించింది. కరువు మండలాల ప్రకటనతో పాటు రాష్ట్రానికి అవసరమైన సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపాలని కేబినెట్ నిర్ణయించింది.
65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ సీజన్‌లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
విద్యుత్ డిమాండ్‌పై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్‌ను సమకూర్చుకోవాలని, అవసరానికి అనుగుణంగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని పెంచే చర్యలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 7,800 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చర్చించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో 3,000 మెగావాట్ల సౌర విద్యుత్, 4,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా బిడ్డింగ్ విధానంలో ఈ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది.
కోహెడలో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మార్కెట్‌ను పూర్తిగా ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేయాలని సూచించింది.
10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులకు బ్రేక్
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పునఃసమీక్షించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈపీసీ విధానంలో చేపట్టిన ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నట్లయితే వాటిని రద్దు చేసే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా 10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
డిజిటల్ మీడియా ప్రకటనల పాలసీకి ఆమోదం
తెలంగాణలో డిజిటల్ మీడియా ప్రకటనలకు ప్రత్యేక పాలసీ అమలు చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ రూపొందించిన డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ పాలసీకి అనుగుణంగా రాష్ట్ర పాలసీని రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ భవన్‌లో అదనపు అధికారుల నియామకం
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పోస్టుతో పాటు నలుగురు గ్రూప్-1 అధికారులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున విధులు నిర్వహించేందుకు నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాకు వెల్లడించారు.