బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతాం
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతాం: వై. మధుసూదన్ నాయుడు
పుంగనూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై టీడీపీ కట్టుబడి ఉందని పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వై. మధుసూదన్ నాయుడు తెలిపారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో 34 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించి జీవో నంబర్లు 105, 1065 జారీ చేసిందన్నారు. అయితే ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ నేతలు కోర్టును ఆశ్రయించి అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించలేదని, దీనివల్ల 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారని మధుసూదన్ నాయుడు ఆరోపించారు. ప్రస్తుతం కూడా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.
బీసీల రాజకీయ సాధికారతకు టీడీపీ కృషి చేసిందని ఆయన పేర్కొన్నారు. 1987లో 20 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 1995లో 34 శాతానికి పెంచిన ఘనత టీడీపీదేనని తెలిపారు. బీసీలకు న్యాయం చేయడం తమ పార్టీ విధానంలో భాగమని అన్నారు.
హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, అందుబాటులో ఉన్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకుంటామని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తమ నిర్ణయంలో మార్పు లేదని, ఈ అంశంపై నిరంతరం కృషి చేస్తామని మధుసూదన్ నాయుడు స్పష్టం చేశారు.