చిట్యాల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన యాదాద్రి జోన్ ఐజీ షాహనవాజ్ ఖాసిం
రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని యాదాద్రి జోన్ ఐజీ షాహనవాజ్ ఖాసిం పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఉన్నారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. జాతీయ రహదారితో పాటు ఇతర రహదారులపై తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించాలని సూచించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా విని చట్టప్రకారం సత్వర పరిష్కారం చూపాలని సూచించారు. దొంగతనాలు, వాహనాల చోరీలను అరికట్టేందుకు రాత్రి పెట్రోలింగ్ ను ముమ్మరం చేయడంతో పాటు సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచాలని తెలిపారు. మహిళలు, బాలికల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పోక్సో కేసుల్లో బాధితుల గోప్యతను కాపాడుతూ నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని పేర్కొన్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని, సైబర్ నేరాల బారినపడిన వారు వెంటనే 1930 హెల్ప్ లైన్ ను సంప్రదించేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, నేరాల నియంత్రణకు సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఐజీ సూచనల మేరకు క్షేత్రస్థాయి పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, చిట్యాల సీఐ సురేశ్, ఎస్ఐ వెంకట్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.