ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయిస్తానంటూ మోసం.. తిరుపతికి చెందిన వ్యక్తి అరెస్ట్
మదనపల్లె: ప్రభుత్వ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కరిస్తానని, అధికారులతో మాట్లాడి పనులు చేయిస్తానని ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలపై తిరుపతికి చెందిన షేక్ సయ్యద్ మీర్ (50)ను మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వివిధ సంఘాలు, మీడియా విభాగాలు, అవినీతి నిరోధక సంస్థల్లో రాష్ట్ర ప్రతినిధినంటూ పరిచయం చేసుకుని ప్రజలను మోసగించినట్లు పోలీసులు తెలిపారు.
అధికారులతో తనకు పరిచయాలు ఉన్నాయని, వారి ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయిస్తానని నమ్మబలికి బాధితుల నుంచి నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరించి, బలవంతంగా నగదు తీసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం.
వాహన తనిఖీల్లో పట్టుబడిన నిందితుడు
అక్టోబర్ 11న మదనపల్లె–తిరుపతి జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులను గమనించిన నిందితుడు కారును వెనక్కి తిప్పి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి నేరానికి ఉపయోగించినట్లు భావిస్తున్న మారుతి సుజుకి ఈకో కారుతో పాటు మూడు గుర్తింపు కార్డులు, ఒక విజిటింగ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మదనపల్లె వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 189/2026తో కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్లు 316(5), 318(4), 308(5), 351(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మధ్యవర్తుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయిస్తామంటూ ఎవరైనా డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు. వ్యక్తుల హోదాలు, గుర్తింపు కార్డులను నమ్మి నగదు ఇవ్వకుండా, అనుమానం కలిగించే వ్యవహారాలపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.