హెచ్ఐవీ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్
హెచ్ఐవీ నివారణలో 95:95:95 లక్ష్యాల సాధన.. మంచిర్యాల జిల్లా ముందంజ
మంచిర్యాల: హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ నుంచి ఐబీ చౌరస్తా వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ.. ముఖ్యంగా యువతలో హెచ్‌ఐవీపై ఉన్న అపోహలను తొలగించడంతో పాటు, వైరస్‌తో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్షను రూపుమాపాలని సూచించారు. వారికి సమాజం అండగా నిలవాలని, సురక్షిత జీవన విధానాలు, ముందస్తు పరీక్షల ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో కళాజాత బృందాల ద్వారా జిల్లావ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 2,832 హెచ్‌ఐవీ కేసులు నమోదయ్యాయని, బాధితులకు అవగాహనతో పాటు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. హెచ్‌ఐవీ నివారణలో 95:95:95 లక్ష్యాల సాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందని పేర్కొన్నారు.
హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి, రామగుండం కేంద్రాల్లో యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ) చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడం ద్వారా వైరల్ లోడ్‌ను గణనీయంగా తగ్గించవచ్చని, తద్వారా ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని వివరించారు.
భవిష్యత్ తరాలను హెచ్‌ఐవీ బారిన పడకుండా కాపాడేందుకు యువత చురుకైన పాత్ర పోషించాలని ఆయన కోరారు. వైద్యారోగ్యశాఖతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములై మంచిర్యాలను హెచ్‌ఐవీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, దిశ హెచ్‌ఐవీ కోఆర్డినేటర్ నీలిమ, వైద్య బృందం సభ్యులు కాకిరాల వెంకటేశ్వర్లు, ధూప్ సింగ్, రషీద్, ఆర్.ఎస్. పద్మ, సురేందర్, శ్రీనివాస్, సంతోష్, రాజేష్, ఐసీటీసీ కౌన్సిలర్లు, స్నేహ ఎన్జీవో ప్రతినిధులు, దిశ సభ్యులు, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.