నిబంధనలు ఉల్లంఘించిన మెడికల్ షాపులపై చర్యలు..
138 షాపుల లైసెన్సులు సస్పెండ్
డ్రగ్స్ విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ సంయుక్త తనిఖీలు.. మరో రెండు షాపులకు హెచ్చరికలు
హైదరాబాద్, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన 138 మెడికల్ షాపులపై లైసెన్స్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. మరో రెండు షాపులకు హెచ్చరికలు జారీ చేశారు.
138 షాపులపై సస్పెన్షన్ వేటు
మొత్తం 138 సస్పెన్షన్లలో 98 మెడికల్ షాపులపై తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు లైసెన్సులను నిలిపివేశారు. మరో 40 షాపులపై నిర్దిష్ట కాలపరిమితితో సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. ఔషధాల విక్రయంలో నిబంధనలు పాటించకపోవడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు.
ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి
అలవాటు కలిగించే మందులు, షెడ్యూల్ హెచ్, హెచ్1 కేటగిరీ ఔషధాలను చెల్లుబాటు అయ్యే వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే విక్రయించాలి. అలాగే మెడికల్ షాపుల్లో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తనిఖీలు కొనసాగనున్నాయి
ఔషధాల విక్రయంలో పారదర్శకత, ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మెడికల్ షాపుల యజమానులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.