కండక్టర్ ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి: సీఐటీయూ
కోటి రూపాయల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి.. ఎస్. కృష్ణ డిమాండ్
రంగారెడ్డి, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): మణుగూరు ఆర్టీసీ బస్ డిపోలో కండక్టర్గా పనిచేస్తూ విధి నిర్వహణలో గాయపడి మృతి చెందిన ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం న్యాయం చేయాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) హైదరాబాద్ రీజియన్ కార్యదర్శి ఎస్. కృష్ణ డిమాండ్ చేశారు. ప్రవళిక మృతిపట్ల హైదరాబాద్ రీజియన్ కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసిందని తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ప్రవళిక కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి
గత నెల 25వ తేదీన విధి నిర్వహణలో ఉన్న కండక్టర్ ప్రవళికపై ఓ ప్రయాణికురాలు దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడినట్లు కృష్ణ తెలిపారు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రవళిక మృతి చెందిందని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కలిసి రూ.కోటి పరిహారం అందించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సిబ్బందిపై పెరుగుతున్న పనిభారం
మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ సిబ్బందిపై పని భారం విపరీతంగా పెరిగిందని కృష్ణ అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికుల నుంచి సిబ్బందిపై దాడులు కూడా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఆర్టీసీ యాజమాన్యం తగిన రక్షణ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
సిబ్బందికి రక్షణ కల్పించాలి
ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు విచారణ లేకుండా ఏకపక్షంగా ఆర్టీసీ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని కృష్ణ ఆరోపించారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచి, సిబ్బందిపై పని భారాన్ని తగ్గించాలని కోరారు.
ఆర్టీసీ సిబ్బందిపై ప్రయాణికులు దాడులకు పాల్పడే ఘటనలను స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.