జర్నలిస్ట్ రామన్న నాయక్‌పై హత్యాయత్నం..
- బాధిత జర్నలిస్టుకు పోలీసు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి
- జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసిన TUWJ 143 నాయకులు
మహబూబాబాద్ జిల్లా, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్):
గూడూరు మండలం ఏపూరు గ్రామానికి చెందిన గిరిజన వర్కింగ్ జర్నలిస్ట్, జనంసాక్షి జిల్లా స్టాఫ్ రిపోర్టర్, తెలంగాణ ఉద్యమకారుడు, TUWJ 143 గూడూరు మండల ప్రధాన కార్యదర్శి బానోతు రామన్న నాయక్‌పై జరిగిన హత్యాయత్నాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ 143) మహబూబాబాద్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.
ఈ మేరకు శనివారం యూనియన్ నాయకులు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, ఐపీఎస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గిరిజనుల సమస్యలు, ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకువస్తూ ప్రజల పక్షాన పనిచేస్తున్న రామన్న నాయక్‌పై కొందరు వ్యక్తులు కక్షగట్టి పక్కా ప్రణాళికతో హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపించారు.
నంబర్ ప్లేట్ లేని కారులో సంచరిస్తూ ముందుగా రెక్కీ నిర్వహించిన ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు, రామన్న నాయక్ బైక్‌పై వెళ్తుండగా మామిడి తోట సమీపంలో కారుతో వెంబడించి అడ్డగించారని తెలిపారు. అనంతరం బీరు సీసాలు, ఇనుప రాళ్లు, కత్తులతో దాడికి పాల్పడినట్లు వివరించారు.
ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దాడికి పాల్పడిన ఐదుగురు నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని కోరారు. దాడి వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారుల వివరాలను సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనల ప్రకారం నిందితులపై రౌడీషీట్ నమోదు చేయాలని, బాధిత జర్నలిస్ట్ బానోతు రామన్న నాయక్‌కు తగిన పోలీసు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.
ఈ కార్యక్రమంలో TUWJ 143 మహబూబాబాద్ జిల్లా కో-కన్వీనర్ గాడిపెళ్లి శేఖర్, TTWJA రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు చందు నాయక్, జిల్లా అధ్యక్షుడు లావుడియా మనోహర్ చౌహన్, జర్నలిస్టులు రామన్న నాయక్, సుధాకర్, రవి, భానోత్ చందు, ధరావత్ రాజా తదితరులు పాల్గొన్నారు.