మునుగోడు ప్రజలకు శుభవార్త.. రేపు ఉచిత కంటి వైద్య శిబిరం
కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా శుక్లాల ఆపరేషన్లు
మునుగోడు, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్):
మునుగోడు మండల ప్రజలకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. నవంబర్ 1, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మునుగోడులోని ఫౌండేషన్ క్యాంపు కార్యాలయంలో ఈ శిబిరం ప్రారంభం కానుంది.
ఈ శిబిరంలో మునుగోడు మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచించారు.
శుక్లాల ఆపరేషన్లు కూడా ఉచితమే
కంటి శుక్లాల సమస్యతో బాధపడుతూ శస్త్రచికిత్స అవసరమైన వారిని వైద్య పరీక్షల ద్వారా గుర్తించి, హైదరాబాద్‌కు తరలించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అక్కడ ఉచితంగా ఆపరేషన్లు చేయించిన అనంతరం తిరిగి స్వగ్రామాలకు తీసుకొస్తామని పేర్కొన్నారు.
తీసుకురావాల్సిన పత్రాలు
శిబిరానికి వచ్చే వారు ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌తో పాటు గతంలో వినియోగించిన కంటి మందులు లేదా ఇతర మందులను వెంట తీసుకురావాలని సూచించారు.
మునుగోడు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నిర్వాహకులు కోరారు.