పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్ సమరశంఖం
- ప్రతి గ్రామం, తండాలో ప్రచారం నిర్వహించాలని నాయకులకు పిలుపు
- ఓటరు నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలి: చెరుకుపల్లి నరేందర్
మహబూబాబాద్ జిల్లా, బయ్యారం, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్):
రానున్న వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి విజయమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని ఇల్లందు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చెరుకుపల్లి నరేందర్ పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని సూచించారు.
బయ్యారం మండల కేంద్రంలోని వీబీటీ ఫంక్షన్ హాలులో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఓటు హక్కు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామం, తండాలో పర్యటించి ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం నిర్వహించాలని యువజన కాంగ్రెస్ నాయకులకు సూచించారు.
పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించే నాయకుడికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డికి పట్టభద్రులంతా అండగా నిలవాలని కోరారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా అర్హులైన వారందరూ నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకునేలా కృషి చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో ఇల్లందు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సుమిత్ కోరి, మండల అధ్యక్షులు మండ నాగరాజు, అందనాల రాజీవ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వెంకటపతి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అఖిల్, మండల ఉపాధ్యక్షుడు ప్రదీప్ తదితర యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.