బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు
- ఆపద సమయంలో 1098, 112, న్యాయ సహాయం కోసం 15100కు సంప్రదించాలని సూచన
- విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాలల భద్రతపై అవగాహన
యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్):
బాలల హక్కుల పరిరక్షణ, భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో యాదాద్రి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు వలిగొండలోని మాంటిస్సోరి హైస్కూల్ ఆవరణలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. “సురక్ష బచ్‌పన్ అభియాన్ – బాలల హక్కులు, పోక్సో చట్టం–2012” అనే అంశంపై ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామన్నపేట మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, బాలల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
సదస్సులో బాలలపై లైంగిక వేధింపుల నిరోధక పోక్సో చట్టం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు వివరించారు. ఆపద సమయంలో సహాయం కోసం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, పోలీస్ హెల్ప్‌లైన్ 112, ఉచిత న్యాయ సహాయం కోసం 15100 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
సోషల్ మీడియాను విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు, భవిష్యత్తు లక్ష్యాలను చేరుకునేందుకు ఉపయోగించుకోవాలని, అనవసర ఆకర్షణలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని జడ్జి విద్యార్థులకు సూచించారు. ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు మంచి పౌరులుగా ఎదిగి సమాజ అభివృద్ధికి, దేశ పురోగతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్లు కునూరు శ్రీనివాస్, సోమ సతీష్ రెడ్డి, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ సభ్యుడు కనుగంటి శ్రీశైలం, పారా లీగల్ వాలంటీర్ కురిమేటి యాదయ్య పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు అందించారు.
పాఠశాల డైరెక్టర్ బాలరాజు, ప్రిన్సిపల్ థామస్ అబ్రహం, వలిగొండ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎ. శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, చట్టాలపై అవగాహన పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలకమని నిర్వాహకులు పేర్కొన్నారు.