పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం
శాలువా, పూలమాలతో సత్కరించి అభినందనలు
పోలీస్ శాఖలో అంకితభావంతో సేవలందించారు: ఎస్పీ అక్షన్ యాదవ్
యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపురం, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్):
పోలీస్ శాఖలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్ రెడ్డిని జిల్లా ఎస్పీ అక్షన్ యాదవ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ తన క్యాంపు కార్యాలయంలో మహేందర్ రెడ్డికి శాలువా కప్పి, పూలమాల వేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో బాధ్యతాయుతంగా, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించిన మహేందర్ రెడ్డి సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో ఆయన చూపిన నిబద్ధత, క్రమశిక్షణ ఇతర పోలీసు సిబ్బందికి ఆదర్శమని పేర్కొన్నారు.
పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని జిల్లా పోలీస్ శాఖ తరఫున ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ పాల్గొని మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.