గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన
- ఇళ్ల నిర్మాణానికి ముందుగా పంచాయతీకి దరఖాస్తు చేయాలని తీర్మానం
- బయ్యారం మేజర్ గ్రామపంచాయతీలో ప్రత్యేక గ్రామసభ నిర్వహణ
మహబూబాబాద్ జిల్లా, బయ్యారం, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్):
గిరిజన ప్రాంతాల్లో పీసా (PESA) చట్టం అమలు, గ్రామసభ అధికారాలు, గిరిజనుల హక్కుల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో బయ్యారం మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గిరిజన ప్రాంతాల్లో అమలులో ఉన్న చట్టాలు, గ్రామసభకు కల్పించిన అధికారాలు, ప్రజల హక్కులు, బాధ్యతలపై చర్చించారు.
గ్రామ పరిధిలో నూతనంగా ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారు ముందుగా ఇంటి నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తును గ్రామపంచాయతీకి సమర్పించాలని గ్రామసభలో తీర్మానించారు. ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న వారు కూడా తమ నివాసాలకు సంబంధించిన పూర్తి వివరాలతో పంచాయతీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మార్గదర్శకాలు, వివరాలు అందించేందుకు పంచాయతీ పాలకవర్గం, అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరూ తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, గ్రామాభివృద్ధి కోసం గ్రామసభలో తీసుకునే నిర్ణయాలకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉమా, పంచాయతీ కార్యదర్శి రాంబాబు, వార్డు సభ్యులు అజయ్, ఉమా, కళింగరెడ్డి, సరిత, నాయకులు తుపాకుల సతీష్, తాటి జనార్దన్, పులి మల్లయ్య, షేక్ పెద్ద బుజ్జి, శ్రీకాంత్, రాకేష్, కుంజా రమనాదం, రాంబాబు, ప్రమోద్ రెడ్డి, నందగిరి భద్రయ్య, తగిర సత్తిరెడ్డి, చింత కళ్యాణి, ఈర్ప ముని, మేడె బాబు తదితరులు పాల్గొన్నారు.