జాతీయ ఏక్తా దివస్ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్ సందడి
గిరిజన ఐక్యత, హక్కుల పరిరక్షణపై చర్చ
కొమరం భీం మనవడు కొమరం సోనీ రావుతో భూక్యా ప్రవీణ్ నాయక్ ఆత్మీయ భేటీ
మహబూబాబాద్ జిల్లా, బయ్యారం, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్):
గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ ఏక్తా దివస్ వేడుకలు గిరిజన నేతల ఆత్మీయ కలయికకు వేదికగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గంధంపల్లి–కొత్తపేట గ్రామ సర్పంచ్ భూక్యా ప్రవీణ్ నాయక్ ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం మనవడు కొమరం సోనీ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఫోన్ ద్వారా కొమరం సోనీ రావుతో మాట్లాడి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల ఐక్యత, హక్కుల పరిరక్షణ, ఆదివాసీల అభ్యున్నతికి సంబంధించిన అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో ఇల్లందు నియోజకవర్గంలో నిర్వహించనున్న జాతి ఐక్యత కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఎమ్మెల్యే ఆయనను ఆహ్వానించారు.
అనంతరం సర్పంచ్ భూక్యా ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ.. “జల్, జంగల్, జమీన్” నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన కొమరం భీం ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన పోరాట చరిత్ర, త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
జాతీయ ఏక్తా దివస్ వేడుకల్లో కొమరం భీం వారసుడు కొమరం సోనీ రావును కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ప్రవీణ్ నాయక్ తెలిపారు. గిరిజన ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు హక్కుల పరిరక్షణ, ఆదివాసీల అభ్యున్నతి కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.