బైబిల్ కరపత్రాలు పంపిణీ చేస్తున్న మహిళలపై దాడి
దాడికి పాల్పడిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలి.. సీపీఎం ఎల్బీనగర్ సర్కిల్ కమిటీ డిమాండ్
ఎల్బీనగర్, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): హైదరాబాద్‌లోని బడంగ్‌పేట పరిధి అల్మాస్‌గూడలో బైబిల్ కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఇద్దరు మహిళలపై దాడి జరిగినట్లు వచ్చిన వీడియోపై సీపీఎం ఎల్బీనగర్ సర్కిల్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరింది.
మత స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు
ఈ ఘటనపై సీపీఎం ఎల్బీనగర్ సర్కిల్ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య మాట్లాడుతూ.. మహిళలపై దాడి జరిగినట్లు చూపిస్తున్న వీడియో బాధాకరంగా ఉందన్నారు. బైబిల్ కరపత్రాల పంపిణీ మత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధంగా తెలియజేయాలే తప్ప, మహిళలపై భౌతిక దాడులకు పాల్పడటం సమర్థనీయం కాదని అన్నారు.
బాధితులకు రక్షణ కల్పించాలి
ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు వెంటనే స్పందించి, దాడికి పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలేటి ఎల్లయ్య డిమాండ్ చేశారు. బాధిత మహిళలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు.
రాష్ట్రవ్యాప్త ఆందోళనకు హెచ్చరిక
మహిళల గౌరవం, మత స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోతే మహిళా సంఘాలు, ప్రజా సంఘాలను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను హెచ్చరించారు.