ఉపాధి పనుల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానం
ఒకేరోజు 53,280 మంది కూలీలకు పని.. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలకు పైగా హాజరు
నల్గొండ, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించడంలో నల్గొండ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. మంగళవారం ఒక్కరోజే జిల్లాలో 53,280 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు.
రాష్ట్రంలోనే అత్యధిక హాజరు
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం మొత్తం 5,00,166 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరుకాగా, వారిలో అత్యధికంగా నల్గొండ జిల్లాకు చెందిన 53,280 మంది ఉండటం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత
ఉపాధి హామీ పనుల్లో భాగంగా జల సంరక్షణ, శాశ్వత ఆస్తుల నిర్మాణం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు అభివృద్ధి పనులు కూడా ముందుకు సాగుతున్నాయి.
ఒకేరోజు అత్యధిక సంఖ్యలో కూలీలు పనులకు హాజరై నల్గొండ జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవడంపై సంబంధిత వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.