పెనుగొలనులో నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని గ్రంథాలయంలో సోమవారం నవయుగ చక్రవర్తి, కవికోకిల గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో గ్రంథాలయ నిర్వాహకులు తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారని తెలిపారు.
సామాజికంగా అణగారిన వర్గంలో జన్మించిన కారణంగా జాషువా తన జీవితంలో అనేక అవమానాలను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఆ అనుభవాలనే స్ఫూర్తిగా తీసుకుని తన కవిత్వాన్ని సామాజిక చైతన్యానికి ఆయుధంగా మలిచారని తెలిపారు. మూఢాచారాలు, సామాజిక అసమానతలపై తన రచనల ద్వారా జాషువా ప్రశ్నించారని, ఒకప్పుడు చీత్కారాలు ఎదురైన చోటే అనంతరం సత్కారాలు అందుకున్నారని వివరించారు.
జాషువా తన సాహిత్య జీవితంలో అనేక ఖండకావ్యాలు, పద్యకావ్యాలతో పాటు 50కి పైగా రచనలు చేశారని వెంకటేశ్వర్లు తెలిపారు. గబ్బిలం, ఫిరదౌసి, కాందిశీకుడు, శిల్పి, నేతాజీ, బాపూజీ, స్మశాన వాటిక వంటి రచనలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. అలాగే సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకంలోని కాటిసీను పద్యాలు సాహితీప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.
తెలుగు సాహిత్యానికి గుర్రం జాషువా చేసిన సేవలకు అనేక గౌరవాలు లభించాయని, ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, పద్మభూషణ్ వంటి పురస్కారాలు దక్కాయని కొనియాడారు. జాషువా జయంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామస్తులు, పాఠకులు పాల్గొన్నారు.