పెనుగొలని శివాలయంలో వైభవంగా చండీ హోమం
దసరా ఉత్సవాల్లో గాయత్రీ దేవి అలంకరణ.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం శ్రీ పార్వతీ దేవిని శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చేలా అలంకరించారు. ఆలయ అర్చకులు దాములూరి సత్యనారాయణ శర్మ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించడంతోపాటు రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. వేదమంత్రాలు, పూజా కార్యక్రమాలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
దసరా ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించనున్న చండీ హోమాన్ని వేద పండితుడు ఇంద్రగంటి సుబ్రహ్మణ్య శర్మ వేదమంత్రాల పారాయణం మధ్య ప్రారంభించారు. హోమంలో ఆవు నెయ్యితో పాటు 108 రకాల హోమ ద్రవ్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహం కోసం భక్తిశ్రద్ధలతో హోమ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
అదేవిధంగా ఊటుకూరు భాస్కరరావు, లీలావతి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రసాద్, కోడలు రాధిక దంపతుల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఈ విషయాన్ని ఆలయ నిర్వాహకుడు ఊటుకూరు నారాయణరావు తెలిపారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.