ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్ సత్య శారద
ఎల్నినో ప్రభావాలపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలి
నర్సంపేట, అక్టోబర్ 27 | ఎన్ టుడే న్యూస్:
ఎల్నినో ప్రభావాల నేపథ్యంలో రానున్న వాతావరణ పరిస్థితులపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులకు సూచించారు. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు దోహదపడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
ఈ మేరకు కలెక్టర్ గీసుకొండ మండలం వంచనగిరి, దుగ్గొండి మండలంలోని ఎంఐ ట్యాంక్ వద్ద జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల అభివృద్ధి, భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడే పనులను చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కూలీలకు ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు.
నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, నూనెగింజల పంటలను సాగు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
ఉపాధి హామీ పనులను నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. పనుల అమలులో నిర్లక్ష్యం లేకుండా చూడాలని సూచించారు.
ఈ పర్యటనలో జెడ్పీ సీఈఓ వసంత, డీఆర్డీఓ నాగ పద్మజ, ఏపీఓ, ఈసీ, సాంకేతిక సహాయకులు, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.