పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ
మునిపంపుల, దుబ్బాక పాఠశాలల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన
రామన్నపేట, అక్టోబర్ 9: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మునిపంపుల ఉన్నత పాఠశాల, మునిపంపుల, దుబ్బాక ప్రాథమిక పాఠశాలల్లో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ పాటలు పాడుతూ పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.
పాఠశాల హెచ్‌ఎం దొడ్డి స్వామి విద్యార్థులకు బతుకమ్మ పండుగ ప్రాధాన్యతను వివరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి వేడుకలు కీలకమని తెలిపారు. ఉపాధ్యాయులు అందించే విలువలతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని, నైతిక విలువలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
వేడుకల్లో భాగంగా బతుకమ్మ పాటలతో పాటు ‘టగ్ ఆఫ్ వార్’ వంటి వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వం అందించిన షూస్, బెల్టులు, సాక్సులను విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ వాలంటీర్ గాదె పారిజాత, ఉపాధ్యాయులు తిరుమలరెడ్డి, మనోహర్, వసంత, మంజుల, త్రివేణి ప్రసాద్, రేవతి, సరోజ, పాల్వంచ హరికిషన్, లలిత, ధర్మేందర్, రవి, రేణుక, వెంకటలక్ష్మి, శ్రీశైలం, సునీత తదితరులతో పాటు కార్యాలయ సిబ్బంది రాకేష్, జాకీర్, యాదయ్య పాల్గొన్నారు.